శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే నైతిక హక్కు లేదని బిజెపి రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదని, ఆ పార్టీ మూడు రాష్ట్రాల్లో మాత్రమే మిగిలి ఉందని అన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, ఈ దేశం పైన ప్రేమ లేదని, ఒక నాయకుడు ఒకలా మాట్లాడితే మరో నాయకుడు శభాష్ అంటారని అన్నారు. దేశంలో కాదు రాష్ట్రాలలో కూడా అదే తీరున వ్యవహరిస్తున్నారని, ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు చేస్తున్నదేమీ లేదని అన్నారు. దేశంలో ప్రజలు కాంగ్రెస్ కో హఠావో దేశ్ కో బచావో అని నినాదాలు చేస్తూ ఎదురు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత అల్లాడిపోతుంటే పదేపదే నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప యువతకు చేసిన మేలు ఏమీ లేదని ఆరోపించారు.






