శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ ధరిత్రీ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కొండాపూర్ మసీదుబండలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజని అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ ఎర్త్, సీ, ఎన్విరాన్మెంట్ శాస్త్ర ఆచార్యుడు G కిషోర్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని 1970వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం మన శక్తి – మన గ్రహం అనే నినాదంతో దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. WHO నివేదికల ప్రకారం పర్యావరణ కాలుష్యం వలన క్యాన్సర్ వ్యాధులు 19 శాతం వస్తున్నాయని తెలిపారు. అందరికీ ఆరోగ్యకరమైన, స్థిరమైన, సమానమైన, సంపన్నమైన భవిష్యత్తును నిర్మించడానికి రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్ లాంటి చర్యల వలన పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థలైన రైళ్ళు, బస్సులలోనే ప్రయాణించాలని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన విద్యుత్ వాహనాలను వినియోగించాలని, సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా అందరిచేత పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపప్రాధాన అధ్యాపకుడు అంబేద్కర్, అధ్యాపకులు శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, వాణీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.






