శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం తారానగర్లోని శ్రీ తుల్జా భవానీ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన అక్కడి చిరు వ్యాపారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తారానగర్ మర్చంట్స్ అసోషియేషన్ సభ్యులు రవికుమార్ యాదవ్ని కలిసి పోచమ్మ ఆలయం నుండి హనుమాన్ ఆలయం వరకు 100 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేపట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని తెలియజేశారు. సుల్తాన్ బజార్, బేగం బజార్లలా తారానగర్ లోని ఈ మార్కెట్ కూడా మూడు తరాలుగా కొనసాగుతోందని, ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు విస్తరణ ప్రణాళికతో చిన్న వ్యాపార యజమానులు, రోజువారీ కూలీలు, నివాసులు, ఉద్యోగులు వంటి కుటుంబాల జీవితాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అన్నారు. ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు విస్తరణ ప్రణాళికను 60 అడుగులకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు వ్యాపారులు రవికుమార్ యాదవ్కు తెలియజేశారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టదలచిన రోడ్డు విస్తరణ వల్ల ఇక్కడి వ్యాపారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారి పొట్ట కొట్టడం సరికాదని అన్నారు. ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు విస్తరణ ప్రణాళికపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించి, వ్యాపారులకు ఎటువంటి నష్టం కలగకుండా రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడి స్థానికుల, వ్యాపారుల కష్టం తెలిసినవాడిగా వారికి ఏ అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ తరపున పోరాటానికి తాను ముందుంటానని, తన వంతు సహకారం ఎల్లప్పుడూ వారికి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, ఎల్లేష్, శ్రీనివాసరెడ్డి, రామ్ రెడ్డి, రాజు శెట్టి , దినేష్, మల్లేష్ గౌడ్, విజయ్, సునీల్ పాల్గొన్నారు.





