శేరిలింగంపల్లి, మార్చి 14 (నమస్తే శేరిలింగంపల్లి): పనిచేస్తున్న ఇంట్లో దొంగతనం చేసిన ఓ మహిళను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు ఈ మేరకు వివరాలను వెల్లడించారు. మియాపూర్‌లోని హఫీజ్‌పేట ఆదిత్య ఇంపీరియల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న శ్వేత అక్కెనపల్లి స్థానికంగా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తోంది. మార్చి 14వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో తన ఇంట్లోని 60 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.4వేల నగదు కనిపించకపోవడంతో ఆమె మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంటికి పనిమనిషిగా వస్తున్న మహిళే ఈ పనిచేసి ఉంటుందని శ్వేత పోలీసుల ఎదుట అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అపార్ట్మెంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో పనిమనిషి దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ క్రమంలో పోలీసులు మియాపూర్‌లోని ఓల్డ్ హఫీజ్‌పేటలో నివాసం ఉంటున్న సదరు మహిళ ఇంటికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి ఆమె నుంచి దొంగలించబడిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలించారు. తెలియని వ్యక్తులను ఇంట్లో పని చేసేందుకు నియమించుకోవద్దని, వారి కదలికలపై నిఘా ఉంచాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని, ప్రతి అపార్ట్మెంట్లో సీసీటీవీలను తప్పనిసరిగా అమర్చుకోవాలని, సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలని అన్నారు.






