ప‌సికందు కిడ్నాప్ కేసు.. 72 గంట‌ల్లో కేసును ఛేదించిన చందాన‌గ‌ర్ పోలీసులు..

శేరిలింగంప‌ల్లి, జూలై 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తల్లి ఒడిలో నుంచి అపహరణకు గురైన నెల రోజుల పసికందును చందానగర్ పోలీసులు మూడు రోజుల వ్యవధిలో సురక్షితంగా రక్షించి, అంతర్రాష్ట్ర కిడ్నాప్-శిశు రవాణా ముఠాను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 30 తెల్లవారుజామున 2 గంటల సమయంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన సర్కస్ బృంద సభ్యులతో కలిసి నిద్రిస్తున్న కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన మలన్ బౌరవ్ శాంతాబాయి ఒడిలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి నెల రోజుల పాపను బలవంతంగా ఎత్తుకెళ్లారు. పాప ఏడుపు వినిపించడంతో మేల్కొన్న తల్లి వారిని వెంబడించినప్పటికీ నిందితులు ఆటోలో పరారయ్యారు.

ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్సీ పురం డివిజన్ ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఎస్. విజయ్, డీఐ సత్యనారాయణ, డీఐ ఎన్. భాస్కర్ నేతృత్వంలోని బృందాలు సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ నగరాల్లోని భారీ సంఖ్యలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి మూడు రోజుల పాటు నిరంతరంగా దర్యాప్తు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన సంతానం లేని మహిళ రహనుమా అలీ డబ్బులు చెల్లించి శిశువును తెప్పించుకోవాలని తన బంధువురాలు సీమ అలీని కోరినట్లు తేలింది. సీమ ఈ విషయాన్ని తన స్నేహితురాలు నాజియాకు చెప్పగా, ఆమె తనకు కాబోయే భర్త జుబేర్‌కు సమాచారం అందించింది. అనంతరం జుబేర్ తన సహచరుడు, ఆటో డ్రైవర్ ఇర్ఫాన్‌తో కలిసి శిశువును అపహరించి విక్రయించేందుకు కుట్ర పన్నారు.

జూన్ 30 తెల్లవారుజామున లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద నిద్రిస్తున్న తల్లి ఒడిలో నుంచి పాపను అపహరించి నాజియా ఇంటికి తరలించారు. అనంతరం రహనుమా అలీ కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు విమానంలో చేరగా, శిశువు కొనుగోలు కోసం జుబేర్ ఖాతాకు రూ.1.50 లక్షలను ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు చిన్నారిని కోల్‌కతాకు తరలించేలోపే పోలీసులు వారిని అరెస్ట్ చేసి, పసికందును సురక్షితంగా రక్షించి ఆమె తల్లికి అప్పగించారు. ఈ ఆపరేషన్‌తో అంతర్రాష్ట్ర శిశు అపహరణ, రవాణా ముఠాను ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. మహ్మద్ జుబేర్ ప్రధాన నిందితుడు కాగా, మహ్మద్ ఇర్ఫాన్ సహ నిందితుడు అని, సాదేకా మక్సూద్ అలియాస్ నాజియా మధ్యవర్తిగా వ్య‌వ‌హ‌రించింద‌ని పోలీసులు తెలిపారు. నిమ్మి జహాన్ అలీ అలియాస్ సీమ అలీ మధ్యవర్తి కాగా, రహనుమా అలీ శిశువును కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మహిళ అని వెల్ల‌డించారు. ఈ కేసును వేగంగా ఛేదించి చిన్నారిని సురక్షితంగా రక్షించిన దర్యాప్తు బృందాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here