మియాపూర్‌లో చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్ట్

శేరిలింగంప‌ల్లి, మార్చి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ కేసును చేధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని మియాపూర్ డీఐ రమేష్ నాయుడు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన 36 ఏళ్ల గృహిణి గత నెల 25న మియాపూర్‌లోని వశిష్ట జూనియర్ కళాశాలలో చదువుతున్న తన కుమార్తెను కలిసేందుకు వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం కళాశాల రోడ్‌లో బస్ స్టాప్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న సుమారు 70 గ్రాముల మంగళసూత్రం గొలుసును అకస్మాత్తుగా లాగి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గొలుసులో సుమారు 10 గ్రాముల బంగారు భాగాన్ని బలవంతంగా లాగి తీసుకెళ్లగా, మిగిలిన సుమారు 60 గ్రాముల భాగం ఆమె చీరలో చిక్కుకుని ఆమె వద్దే ఉంది.

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. పైపులైన్ రోడ్ ప్రాంతంలో నివసిస్తున్న ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన అభయ్ కుమార్ దూబే (30), ఆకాశ్ కుమార్ రాజక్ (18)లను అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పని చేస్తూ, ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు వెల్లడైందన్నారు. చైన్ స్నాచింగ్‌కు ఉపయోగించిన బైక్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకుని, దొంగిలించిన 10 గ్రాముల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చైన్ స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. రోడ్డుపై నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ద్విచక్ర వాహనాలు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టగలమని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here