నమస్తే శేరిలింగంపల్లి: గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVM) వినియోగం పెరిగిన నాటి నుండి పేపర్ బ్యాలెట్ వాడకం దాదాపుగా తగ్గిపోయింది. చాలామంది కొత్త ఓటర్లకు పేపర్ బ్యాలట్ ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. ఇక కొంతమంది నిరక్షరాస్యులు, వయసు మళ్ళిన వారి సంగతి సరేసరి. 1952 నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో ఎన్నికల్లో పాల్గొంటున్నప్పటికీ ఓటర్లు తప్పులు చేస్తూనే ఉన్నారు. ఫలితంగా తమ విలువైన ఓటును వ్యర్థం చేసుకుంటూనే ఉన్నారు. పేపర్ బ్యాలట్ ఉపయోగించే ఎన్నికల్లో అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రద్దయ్యే ఓట్ల సంఖ్య ప్రతీ ఎన్నికలో పెరుగుతూనే ఉంటుంది. ఫలితంగా ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములు, రద్దయ్యే ఓట్ల కారణంగా తారుమారు అవుతున్నాయి. ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో మరోసారి పేపర్ బ్యాలెట్ విధానంలో ఓటు వేయబోతున్నాము. కావున ప్రతీ ఓటరు ఎన్నికల్లో పాల్గొనేముందు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.

పేపర్ బ్యాలట్ ఉపయోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.
- పేపర్ బ్యాలట్ పై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి క్రమ సంఖ్య , పేరు , గుర్తు నిర్దిష్టమైన బాక్స్ లో ముద్రించి ఉంటుంది. ఆ గడిలో ఎక్కడ ముద్ర వేసినా చెల్లిన ఓటుగానే పరిగణిస్తారు. (ఒకే ముద్ర వేయాలి)
- గుర్తు పైననే ముద్ర ఉండాలనే నిబంధన ఉండదు . అభ్యర్థి కి సంబంధించిన గడి లో కాకుండా, గడికి పైనా , క్రిందా ఉండే గీత మీద ముద్ర వేయరాదు. ఇటువంటి ఓట్లను పక్కన పెట్టి, చివరగా ఒక్కొక్క దానిని పరిశీలించి ముద్ర ఎవరి భాగం లో ఎక్కువగా ఉంటే ఆ అభ్యర్థికి ఖాతాలో ఓటు జమ చేస్తారు.
- బ్యాలట్ పేపర్ వెనుక ముద్ర వేయరాదు, ముద్రకు ఎక్కువ సిరా / ఇంక్ లేకుండా చూసుకోవాలి
- బాలట్ పేపర్ వెనుక ప్రిసైడింగ్ ఆఫిసర్ సంతకం ఉన్నదా అని చూసుకుంటే మంచిది (ఇది ఓటర్ బాధ్యత కాదనుకోండి )
- ఒకే బ్యాలట్ పేపర్ పై ఇద్దరు అభ్యర్థుల గడులలో ముద్ర వేయరాదు. అటువంటి ఓట్లను చెల్లని ఓట్లు గా పరిగణిస్తారు.
- బ్యాలెట్ పేపర్ పైన స్వస్తిక్ ముద్ర వేయడం తప్ప, వ్యక్తులు పార్టీల పేర్లు గానీ, ఇతర వ్యాఖ్యలు ఏమీ రాయకూడదు. అటువంటి ఓట్లు చెల్లవు.
- అతి ముఖ్యమైన విషయం బ్యాలట్ పేపర్ ను మొదట నిలువుగా / పొడువుగా మలవాలి . ఆ తరువాత అడ్డంగా మలవాలి, అడ్డంగా మలిస్తే ఓటు వేసిన ఇంకు ముద్ర మరో గడిలో పడే అవకాశం ఉంటుంది.
- ఓటరు బ్యాలట్ పేపర్ పై రహస్యంగా నే ముద్ర వేయాలి, బ్యాలట్ బాక్స్ లో తానే స్వయంగా వేయాలి , ఎవరికి వేశాడో చెప్పకూడదు.
- ఎడమ చేతి చూపుడు వేలికి వేసిన ఇండెలిబుల్ ఇంక్ ను తుడిచి వేయరాదు .

సమాచార సేకరణ: మనోహర్ బోరంచ, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, అపర్ణ సరోవర్, నల్లగండ్ల





