శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఇజ్జత్‌నగర్ డివిజన్ పరిధిలోని శిల్పా హిల్స్, హైటెక్స్ ప్రాంతాల నివాసితులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ స్థానిక నివాసితులతో కలిసి మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణకు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ కమిషనర్ సంబంధిత అధికారులను తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శిల్పా హిల్స్ ప్రాంతంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను గంగల రాధాకృష్ణ యాదవ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మొండి కుంట చెరువు నుంచి ఇజ్జత్‌నగర్ బస్తీ వరకు రోడ్డు నంబర్ 2 మీదుగా ప్రవహిస్తున్న నాలాను అనేక సంవత్సరాలుగా శుభ్రం చేయకపోవడంతో రోడ్డు నంబర్లు 2, 3, 4 పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోందని వివరించారు. నాలా నుంచి వెలువడుతున్న దుర్వాసన, విషవాయువుల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

నాలాపై ఉన్న పలు స్లాబులు పగిలిపోవడంతో మురుగు వాసన నేరుగా నివాస ప్రాంతాలకు వ్యాపిస్తోందని, ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు ముప్పుగా మారుతోందని పేర్కొన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నాలాను వెంటనే శుభ్రం చేయడంతోపాటు, దెబ్బతిన్న స్లాబులను మార్చి అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. అదేవిధంగా డ్రైనేజీ లీకేజీల నివారణ, రహదారుల మరమ్మత్తులు, వీధి దీపాల ఏర్పాటు, చెత్త తొలగింపు వంటి ఇతర సమస్యలను కూడా వినతిపత్రంలో ప్రస్తావించారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరారు.
ఈ సందర్భంగా గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, భద్రతతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా నాలా శుభ్రపరిచే పనులు, పగిలిపోయిన స్లాబుల మార్పిడి విషయంలో అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ ప్రజల పక్షాన కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజావాణిలో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణకు శిల్పా హిల్స్ నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో శిల్పా హిల్స్ కాలనీ వాసులు వెంకట్ రెడ్డి, మురళి, శేషసాయి, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.





