ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్‌ రాజకీయ నాటకాలు: నీరటి చంద్రమోహన్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను అయోమయానికి గురిచేస్తూ, యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్‌ విమర్శించారు. కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నాలు, నిరసనలు రాజకీయ నాటకాల్లో భాగమేనని ఆయన ఆరోపించారు. అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. సోషల్‌ మీడియా వేదికలను ఉపయోగించుకుంటూ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

బీహార్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియను ఓటు చోరీగా చిత్రీకరించడం కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహమని చంద్రమోహన్‌ ఆరోపించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌ వైఖరిని గమనిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెబుతున్న నేతలు, ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. రాష్ట్రాల్లో పాలనను పక్కనపెట్టి ఢిల్లీకి వచ్చి ధర్నాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించిన చంద్రమోహన్‌, నెహ్రూ నుంచి రాహుల్‌ గాంధీ వరకు కాంగ్రెస్‌ నాయకత్వం ఇదే రాజకీయ ధోరణిని కొనసాగిస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై బురద చల్లడం తప్ప కాంగ్రెస్‌ పార్టీకి మరో పని లేదని వ్యాఖ్యానించారు.

కేరళలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ నాయకుల వైఖరిని ప్రస్తావిస్తూ, ఒకవైపు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ మరోవైపు దానికి మద్దతు పలకడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. ప్రజలకు న్యాయం చేసే విధానాలను అడ్డుకోవడం కాకుండా, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ పార్టీకి హితవు పలికారు. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన నీరటి చంద్రమోహన్‌, కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here