శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మాదాపూర్ పోలీసులతో పాటు కూకట్‌పల్లి ఎస్‌ఓటీ బృందం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. అక్టోబర్ 25న రాత్రి 9 గంటల సమయంలో సర్వే ఆఫ్ ఇండియా కాలనీ, చంద్ర నాయక్ తండాలోని ఓరియన్ ఎలిగెంట్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 201లో ఈ దాడి జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడిలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను పోలీసులు రక్షించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

పోలీసులు రక్షించిన వారిలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన రుస్తమోవా మఫ్తునా (26), నపసోవా గుజల్ (26), దవ్రనోవా మఖ్లియో (24) ఉన్నారు. వీరు మాదాపూర్‌లోని సదరు సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రక్షించిన ముగ్గురు మహిళలను న్యాయస్థానం ముందు హాజరుపరిచి, తగిన ఆశ్రయ గృహంలో ఉంచడం, పునరావాసం కల్పించడం వంటి అంశాలపై అవసరమైన ఆదేశాలు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సర్వీస్ అపార్ట్‌మెంట్ల యజమానులు, నిర్వాహకులు తమ వద్ద బస చేసే వ్యక్తుల గుర్తింపు, చెల్లుబాటు అయ్యే పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. నిబంధనల ప్రకారం అవసరమైన రికార్డులను నిర్వహించాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి దర్యాప్తునకు సహకరించాలని ప్రజలను కోరారు.





