హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని కొలన్ నారాయణ రెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, టీఎస్‌క్యాబ్ ఛైర్మెన్ కొండూరి రవీందర్ రావు, నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా తెరాస పార్టీ ఇంచార్జ్ తోట ఆగన్న, డివిజన్ తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాసరావులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని, రాబోయే ఎన్నికలలో ప్రజలు తమ అమూల్యమైన ఓటును తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాస్ కు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ దత్తత డివిజన్ ను అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి చేస్తామని అన్నారు.
ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ డిసెంబర్ 1న జరగబోయే ఎన్నికలలో హైదర్ నగర్ డివిజన్ తెరాస పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నార్నె శ్రీనివాస రావుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. హైదర్ నగర్ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైదర్ నగర్ లో ప్రతి సమస్య ను పరిష్కరించామని తెలిపారు. మియపూర్ మెట్రో స్టేషన్ నుండి మిత్ర హిల్స్ వరకు సమాంతర రోడ్డులు నిర్మించామన్నారు. అంబిర్ చెరువు, కిందికుంట, అలీతలాబ్ చెరువులను సుందరీకరించామని అన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పటు చేస్తామని, పార్కులను నిర్మిస్తామని అన్నారు. ప్రజలు తెరాసకు ఓటు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, తెరాస నాయకులు, హైదర్ నగర్ డివిజన్ వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళా నాయకులు, బస్తీ నాయకులు, తెరాస పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.