శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనగా ఈ సంఘటనలో అతను తీవ్ర గాయాల పాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల రాంకీవన్ గెలాక్సియాలో నివాసం ఉంటున్న పంచుమర్తి ప్రదీప్ రామకృష్ణ స్థానికంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనతో తన తండ్రి సత్యనారాయణ (69) కూడా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 30వ తేదీన ఉదయం 9.50 గంటల సమయంలో సత్యనారాయణ సైకిల్‌పై వెళ్తుండగా లింగంపల్లి వద్ద రోడ్డు దాటుతున్న అతన్ని ఓ ద్విచక్ర వాహనం (టీఎస్ 34కె 1520) వేగంగా ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా అతన్ని నగరంలోని ఉస్మానియా హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం అతన్ని మెరుగైన వైద్యం నిమిత్తం మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో అతను చికిత్స పొందుతూ డిసెంబర్ 2వ తేదీన రాత్రి సమయంలో మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి అతని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.





