శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో గౌతమి విద్యాక్షేత్ర రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు రకాల డ్రిల్స్, క్రీడా ప్రదర్శనలతో అలరించారు. అనంతరం హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన హర్డిల్స్ రేస్, రిలే రేస్ అందరినీ ఆకట్టుకున్నాయి. క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను పాఠశాల యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 20, 15, 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని సన్మానించారు.

ఈ కార్యక్రమానికి వరల్డ్ బాక్సింగ్ చాంపియన్, డీఎస్‌పీ నిఖత్ జరీన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బంగారు, రజత, కాంస్య పతకాలను అందజేశారు. క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు గాను ఉపాధ్యాయులు, యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం అరవింద్ రెడ్డి, శ్వేతా రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







