శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళ మెడలో బంగారు ఆభరణాలు చోరీ చేసిన వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ పరిధిలోని మయూరినగర్ యశోద సన్నిధి అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న బంగారు అమూల్య స్థానికంగా మ్యూజికల్ అకాడమీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నవంబర్ 29వ తేదీన ఉదయం 11.40 గంటల సమయంలో ఇంటి నుంచి అకాడమీకి వెళ్తుండగా మార్గమధ్యలో తన వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి తన మెడలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. దీంతో ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితున్ని బి.సతీష్ కుమార్ (32)గా గుర్తించారు. అతను ఉప్పల్లోని మల్లాపూర్ బ్రహ్మ పురి కాలనీలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతన్ని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. అతనిపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో ఒక్కోటి చొప్పున ఇది వరకే కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతని నుంచి ఓ ద్విచక్ర వాహనంతోపాటు ఓ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.






