శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యతరగతి, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిత్యావసర వస్తువులు, విద్యార్థుల పుస్తకాలు, జీవిత బీమా, ఆరోగ్య బీమా పథకాలపై 0 శాతం జీఎస్టీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ బీజేపీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్ రాందీన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ నాయకులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మోదీ చారిత్రాత్మక నిర్ణయం వల్ల ప్రజల భారం తగ్గించే దిశగా తీసుకున్న అపూర్వమైన వరమని తెలిపారు. మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, రైతులు, బీమా రక్షణ అవసరమున్న కుటుంబాలకు ఇది ఆశీర్వాదంగా నిలిచిందని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రోజువారీ ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు , అభిమానులు, కాలనీ వాసులు స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






