శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): MNR స్కూల్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులపై అక్రమ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో జరుగుతున్న దోపిడీని వెంటనే అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) డిమాండ్ చేసింది. ఈ మేరకు AIFDS ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల విద్యాధికారి (MEO) కార్యాలయం ఎదుట గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. AIFDS కార్యదర్శి ముత్తన్నగారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యను వ్యాపారంగా మార్చడం ఆందోళనకరమని అన్నారు. MNR స్కూల్ యాజమాన్యం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ, దీనిపై విద్యాశాఖ వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణాన్ని అందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా మియాపూర్ జడ్‌పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను మండల విద్యాధికారి వెంటనే పరిష్కరించాలని, ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని AIFDS నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్లను పట్టించుకోకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో MNR స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు అరుణ్ శ్రీరామ్, దుర్గాప్రసాద్, గణేష్, రిషిక్, వివేక్, రాజేష్, సన్నీతోపాటు విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





