శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): ఈనెల 24వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న సందర్భంగా వేదిక నరేన్ గార్డెన్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఉదయం 10 గంటలకు నరేన్ గార్డెన్ కు హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగెత్తిపోయారని, అస్తవ్యస్త నిర్ణయాలతో ప్రజలు సతమతమైపోతున్నారని కెసిఆర్ పాలనే బాగుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ బిఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత పార్టీ నాయకులు కార్యకర్తలపై ఉందని అన్నారు.






