శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు ఇచ్చిన 6 వాగ్దాలను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందని, ప్రజల సమస్యలపై పోరాడిన తనను అరెస్టు చేయడం దారుణమని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహించిన సేవ్ హైదరాబాద్ ఛలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సెక్రటేరియట్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల తరపున నిజమైన సమస్యలపై పోరాడిన నేతలను అణచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక ధోరణిని స్పష్టంగా బయటపెడుతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే గట్టి గుణపాఠం చెబుతారని ధ్వజమెత్తారు.






