శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (నమస్తే శేరిలింగంపల్లి): అత్తింటి వరకట్న వేధింపులకు తాళలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని గోపన్‌పల్లి విలేజ్‌కు చెందిన జె.కావ్య అలియాస్ మానస (29)కు, అదే ప్రాంతానికి చెందిన జి.రాజుకు గత 3 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కాగా కావ్య స్థానికంగా ఇళ్లలో పనిచేస్తుండగా రాజు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే వివాహం అయిన సమయం నుంచి కావ్యను రాజు కట్నం కోసం తీవ్రంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. అతని తల్లి, తండ్రి, సోదరి కూడా కావ్యను భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేయసాగారు. ఈ విషయాలను కావ్య తన సోదరి సుమలతకు తరచూ ఫోన్‌లో చెబుతుండేది. ఈ క్రమంలోనే ఆగస్టు 17వ తేదీన తన భార్య కావ్య చనిపోయిందని ఆమె సోదరి సుమలతకు రాజు ఫోన్ ద్వారా విషయాన్ని తెలిపాడు. కావ్య ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుందని చెప్పాడు. దీంతో సుమలత పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని కావ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. తన సోదరి మృతికి కారణమైన భర్త, అత్త, మామ, ఆడపడుచులను అరెస్టు చేయాలని సుమలత తన ఫిర్యాదులో కోరగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





