శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (నమస్తే శేరిలింగంపల్లి): త్వరలో కొనసాగనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డుకు అడ్డంగా మండపాలను ఏర్పాటు చేయకూడదని, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు కృషి చేయాలని అన్నారు. డీజేలతో భారీ ఎత్తున శబ్ద కాలుష్యానికి పాల్పడవద్దని సూచించారు. గణేష్ మండపాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, అందుకు అవసరమైతే పోలీసులకు సహకరించాలని అన్నారు. గణేష్ మండపాల వద్ద క్రమ శిక్షణ పాటించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో మండపాల వద్ద విద్యుదాఘాతానికి తావు లేకుండా పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్నిమాపక శాఖ రక్షణ ప్రమాణాలను పాటించాలని అన్నారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు 120 మంది వరకు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.






