- చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో 7 కత్తిపోట్లకు గురై
- అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన యాదయ్య
- పోలీసు ఉన్నతాధికారుల అభినందనలు
శేరిలింగంపల్లి, ఆగస్టు 16 (నమస్తే శేరిలింగంపల్లి): పోలీసులు అంటే శాంతి భద్రతలను కాపాడడమే కాదు, నేరస్తులను పట్టుకోవడంలో తెగువ చూపించాలి. ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఎలాంటి కష్టం ఎదురైనా సరే ముందుకు సాగి నేరస్తులను చెరలో బంధించాలి. ఆ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా సరిగ్గా ఇదే కోవకే చెందుతారు. విధి నిర్వహణలో తీవ్ర గాయాల పాలైనప్పటికీ ఎంతో తెగువ, ధైర్య సాహసాలను ప్రదర్శంచి నేరస్తుల ఆట కట్టించారు. ఇందుకు గాను ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (రాష్ట్రపతి శౌర్య పతకం) వరించింది. వివరాల్లోకి వెళితే..

చేవెళ్లకు చెందిన చదువు యాదయ్య సైబరాబాద్ కమిషనరేట్ మాదాపూర్ సీసీఎస్ పరిధిలోని మియాపూర్ క్రైమ్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2022లో ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తుండగా చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో ఏడు కత్తిపోట్లకు గురయ్యారు. అయినప్పటికీ ధైర్య సాహసాలను ప్రదర్శించి వారి ఆట కట్టించారు. ఈ క్రమంలో ఆయన పరాక్రమం, అంకిత భావాన్ని పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు. అందులో భాగంగానే హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకం లభించింది. ఈ మేరకు ఆయన ఆ పతకాన్ని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్వాతంత్య్ర్య దినోత్సవం సందర్భంగా అందుకున్నారు. ఇందుకు గాను యాదయ్యను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కె.నర్సింహ, సీసీఎస్ మాదాపూర్ ఇన్స్పెక్టర్ జి.వినాయక రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.





