- సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలను నడిపే వారిని ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టబోమని సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ఇటీవల మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. మద్యం సేవించి వాహనాలను నడిపించడం, యాక్సిడెంట్లు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఇందుకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304 పార్ట్ 2 ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
వాహనాలాను ఎల్లప్పుడూ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్ (ఆర్‌టీఏఎం) పర్యవేక్షిస్తుందని, అందువల్ల మద్యం సేవించి వాహనాలను నడిపేవారు తమను ఎవరూ గమనించడం లేదని అనుకోవద్దన్నారు. అలాగే వాహనదారులకు ఎప్పటికప్పుడు మద్యం పరీక్షలు చేస్తామని, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల అనంతరం అందుకు కారకులైన వారికి వెంటనే మద్యం టెస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు ఎవరైనా సరే సహాయం అందించాలని, కారకులు సంఘటన జరిగిన ప్రదేశం నుంచి తప్పించుకున్నా, పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేయాలని చూసినా.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులు అయితే అలాంటి వారిని ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టబోమన్నారు. అలాంటి నేరాలకు పాల్పడేవారికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుందన్నారు. ఇక పబ్‌ల యాజమాన్యాలు మందు బాబులను విపరీతంగా మద్యం సేవించాక వాహనాల్లో సొంత డ్రైవింగ్‌తో వెళ్లేందుకు అనుమతించకూడదని, ఈ దిశగా పబ్‌ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ఎవరైనా కారకులు సాక్ష్యాలను మాయం చేసే యత్నం చేస్తే వారిపై మోటారు వాహన చట్టం సెక్షన్ 205 ప్రకారం చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.