- ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ పార్క్ కాలనీలో శనివారం మాదాపూర్ మెడిక్యూర్ హాస్పిటల్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వ్యాధి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో స్థానికులు మధుమేహ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులలో మధుమేహ వ్యాధి ఒకటని అన్నారు. ఈ మధుమేహ వ్యాధి చైనా, ఇండియా, అమెరికా తదితర దేశాలలో ఎక్కువగా ఉందని, ఈ వ్యాధి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది చనిపోతున్నారన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మధుమేహ వ్యాధి పరీక్షలు చేసుకొని నిర్దారణ అయినవారు 23 శాతం మంది ఉన్నారని తెలిపారు. వ్యాధి వచ్చి పరీక్షలు చేయించుకోని వారు 10 శాతం వరకు ఉంటారని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాలను వెల్లడించిందన్నారు. ఈ వ్యాధి వలన ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా కిడ్నీ, గుండె, దంత, ఉదరకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ వ్యాధి వలన ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య లక్షలలో ఉందని అన్నారు.
అధిక దాహం, అతిమూత్ర విసర్జన, కంటి చూపు మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే మధుమేహ వ్యాధిగా అనుమానించి వెంటనే పరీక్షలు చేయించుకుని నిర్దారణ అయితే వైద్యుల సూచన మేరకు మందులను వాడాలన్నారు. అలాగే నిత్యం 40 నిమిషాలు వాకింగ్ చేయాలని, ఇతర వ్యాయామాలు చేయాలని సూచించారు. ప్రాణాయామం, మెడిటేషన్ చేయాలని, పౌష్టికాహారం తీసుకోవాలని, అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులను మానివేయాలని అన్నారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలన్నారు. తాజా ఆహారాన్ని తీసుకోవాలన్నారు. దీంతో మధుమేహం అదుపులో ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఖాసిమ్, నిరంజన్ రెడ్డి, మోహనరావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నల్లగొర్ల శ్రీనివాసరావు, శివరామకృష్ణ, రామ్మోహనరావు, జనార్దన్, హాస్పిటల్ ప్రతినిధి వెంకట్ పాల్గొన్నారు.