శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పరిష్కరించవలసిన పలు సమస్యలపై, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల నిధుల మంజూరు కోసం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చర్చించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అక్కడక్కడా నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిధులను మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలనీవాసుల దాహార్తిని తీర్చేందుకు అలాగే మిగిలిపోయిన అసంపూర్తి పనులకు గాను నిధులను మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు జల మండలి ఎండీ అశోక్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు.త్వరలోనే సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి పనులకు అవసరం అయిన నిధులను మంజూరు చేసేలా చూస్తామని చెప్పారని గాంధీ అన్నారు.