గణేష్‌ ఉత్సవాలకు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: మేయర్‌ విజయలక్ష్మీ

  • చెరువుల పరిశీలన

నమస్తే శేరిలింగంపల్లి: వచ్చే నెలలో జరగనున్న గణేష్‌ ఉత్సవాలతో పాటు నిమజ్జనానికి అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ముందస్తు పటిష్ట ప్రణాళికలతో ముందుకు సాగాలని ఎటువంటి పొరపాట్లు అసౌకర్యాలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో మేయర్‌ విజయలక్ష్మీ గురువారం సుడిగాలి పర్యటన చేపట్టారు.

ఈ సందర్భంగా జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌ రెడ్డి సహా పలు విభాగాలకు చెందిన అధికారులతో కలిసి మల్కం చెరువు, గోపి చెరువు, నల్లగండ్ల చెరువు, రాయసముద్రం చెరువు, సాకి చెరువు, గంగారం చెరువు, గౌతమ్‌ బేబీ పాండ్‌, కడియం కుంట, దుర్గం చెరువుతోపాటు ప్రధాన ,అంతర్గత రహదారులను మేయర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ విజయలక్ష్మీ మాట్లాడుతూ ఆయా విభాగాల నడుమ ఎటువంటి సమన్వయ లోపం లేకుండా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని, ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణను అత్యంత పకడ్బందీగా చేపట్టాలన్నారు. వినాయక ప్రతిమల నిమజ్జనానికి బేబీ పాండ్లకు సిద్ధం చేయాలని, వాటిల్లో పేరుకుపోయిన వ్యర్థాలను ముందస్తుగా తొలగించి సంసిద్ధం చేయాలని సూచించారు. శోభాయాత్రలు జరిగే ప్రాంతాలలో రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, పాండ్ల వద్ద విద్యుత్‌ దీపాలు, సానిటేషన్‌ సహా అనుబంధ అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. చెరువుల పరిరక్షణకు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని, డెంగ్యూ కేసులు గుర్తించ బడిన ప్రాంతాలలో నివారణ చర్యలు చేపట్టాలని ఎంటమాలజీ విభాగాన్ని మేయర్‌ ఆదేశించారు. ఖాజాగూడ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. సీఎస్ఆర్‌ కింద పచ్చదనం, పార్కుల నిర్వహణకు చర్యలు వేగవంతం చేయాలని మేయర్‌ తెలిపారు. జోన్‌లో పారిశుద్ధ్యం మెరుగుకు నూతనంగా చేపడుతున్న చర్యలను జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి మేయర్‌ విజయలక్ష్మీకి వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీలు, ఇంజినీరింగ్‌, పారిశుద్ధ్యం , పట్టణ ప్రణాళిక, ఎంటమాలజీ విభాగాలతో పాటు ఆయా డివిజన్‌ల కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్‌, గంగాధర్‌రెడ్డి, రాగం నాగేందర్‌యాదవ్‌, పుష్పనగేష్‌యాదవ్‌, మంజులరెడ్డి, పూజిత, హమీద్‌ పటేల్‌ ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here