
శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి వహించడం సరి కాదని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్ అన్నారు. కాలనీలో మరమ్మత్తులకు గురైన బోర్ వెల్స్ ను ఆయన శనివారం స్వంత ఖర్చులతో రిపేరు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో అందుబాటులో ఉన్న రెండు బోర్ వెల్స్ పాడవ్వగా మరమ్మట్లు చేయించాలని జిహెచ్ఎంసి, జల మండలి అధికారులకు విన్నవించానన్నారు. కాగా రెండు విభాగాల అధికారులు సదరు పని తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకున్నారని ఆరోపించారు. దీంతో ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని స్వంత ఖర్చులతో మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు. కాలనీలో ఎటువంటి సమస్య తలెత్తిన వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు భేరి రామచందర్ యాదవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాటర్ లైన్ మెన్ రాములు, విద్యుత్ శాఖ సిబ్బంది మూర్తి, లక్ష్మణ్, కాలనీ వాసులు సత్యమ్మ, వసంత, ఎం మౌలాలి, శివ, వసంత్ కుమార్, రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.





