- నారాయణ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వినయ్
నమస్తే శేరిలింగంపల్లి: పరీక్షల్లో మార్కులు తక్కువ రావడం పట్ల మనస్తాపం చెంది ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం… మృతుడి స్నేహితుల కథనం ప్రకారం .. మాదాపూర్ లోని చంద్రనాయక్ తండాలోని నారాయణ కాలేజీ లో తొన్నేటి వినయ్ (17) ఐఐటీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు.
జనవరి 27వ తేదీన ఐఐటీ జేఈఈ పరీక్షలను రాశాడు. అనంతరం విడుదలైన కీ పేపర్ లో తనకు మార్కులు తక్కువ రావడం పట్ల మనస్తాపం చెందాడు. నేడు 10 తేదీన నారాయణ కాలేజీ రూమ్ నంబర్ 403 లో ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయాడు. తోటి విద్యార్థులు వినయ్ ఫ్యాన్ కి వెలాడుతుండడం చూసి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం డోర్ వేసి ఉండడం తో పగలగొట్టి వేలాడుతున్న విద్యార్థిని కిందకు దించారు. చికిత్స నిమిత్తం. మెడికోవర్ దవాఖానకు తరలించారు. డ్యూటీ డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి విద్యార్థి తల్లిదండ్రులకు విషయం తెలిపారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.