- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి నల్లగండ్ల మార్కెట్ కూరగాయల వ్యాపారుల వినతి
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎదుట శేరిలింగంపల్లి నల్లగండ్ల మార్కెట్ కూరగాయల వ్యాపారులు వాపోయారు. ఈ మేరకు వారు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆరెకపూడి గాంధీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వ్యాపారులు వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎమ్మెల్యేకు విన్నవించారు.
వరద కారణంగా తారానగర్ నల్లగండ్ల కూరగాయల మార్కెట్ తో పాటు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తుల దుకాణాలు పూర్తిగా మునిగి ఆర్థికంగా దెబ్బ తిన్నారని వరద ముంపు బాధితులతో పాటు వారికి కూడా న్యాయం చేయాలని కోరారు. అధికారులతో మాట్లాడి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని ఆరెకపూడి గాంధీ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవ రావు, కూరగాయల మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఖాజాపాషా, జాయింట్ సెక్రటరీ షేక్ అహ్మద్, కోశాధికారి శ్రీనివాస్, రాజు, లాలా, రాంచందర్, శాంతి కుమార్ పాల్గొన్నారు.