- అధికారులు కాకుండా తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు
వరద సహాయం ఎలా పంపిణీ చేస్తారు ? - అధికారులకు అందుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ?
- సెల్లార్లలో ఉండే వాచ్‌మన్ల కుటుంబాలు బాధితులు కారా
- రాజకీయ లబ్ధికోసమే వరద సహాయం పంపిణీ
- బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులందరికీ సహాయం అందించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు సంభవించిన వరదల కారణంగా దీప్తిశ్రీనగర్‌లో స్థానికులు భారీ ఎత్తున నష్టపోయిన విషయం విదితమే. అయితే తమకు సహాయం అందించాలని కోరుతూ వారు ఇప్పటికే పలు మార్లు జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు శుక్రవారం బీజేపీ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో చందానగర్ డీసీ సుధాంష్‌ను కలిశారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన వరద సహాయం పంపిణీ చేయాలని కోరారు. అందుకు డీసీ స్పందిస్తూ.. కేవలం నోటిఫైడ్ స్లమ్‌లలో మాత్రమే సహాయం పంపిణీ చేయడం జరుగుతుందని, దీప్తిశ్రీనగర్ ఆ జాబితాలో లేదని తెలిపారు.
ఈ సందర్భంగా చందానగర్ సర్కిల్ కార్యాలయం వద్ద భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల కోసం రూ.449 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. అందులో భాగంగా తొలి విడతలో రూ.224.50 కోట్లను విడుదల చేశారని, ఆ డబ్బును వరద బాధితులకు కుటుంబానికి రూ.10వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని అన్నారు. అయితే సదరు నగదును అధికారులు పంపిణీ చేయాల్సిందిపోయి తెరాస నాయకులు పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా లబ్ది పొందేందుకే వారే నేరుగా తమకు అనుకూలంగా ఉన్న వారికే సదరు సహాయాన్ని పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు వరద సహాయం అందడం లేదన్నారు.
పలు వాడలు, బస్తీలు, కాలనీలలో తమకు అనుకూలంగా ఉన్నవారికి, తమ అనుయాయులకు ప్రత్యక్షంగా డబ్బులను పంపిణీ చేస్తున్నారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని దీప్తిశ్రీనగర్ కాలనీలో వరద ముంపు వల్ల దాదాపుగా 100 కుటుంబాలకు తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందని, ఈ విషయమై డిప్యూటీ కమీషనర్ కి 28/10/2020 వ తేదీన రాతపూర్వకంగా అర్జీ ఇచ్చామని తెలిపారు. తరువాత పలుసార్లు ఫోన్ ద్వారా నష్టపరిహారం గురించి అడిగినా ఆయన నుండి స్పందన కరువయిందన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం బాధితులతో కలిసి డీసీ కార్యాలయానికి వెళ్లి ఫోన్ ద్వారా మరొక్కసారి పరిహారం గురించి అభ్యర్ధించామన్నారు. నోటిఫైడ్ స్లమ్ లిస్టులో ఉన్న వాడలు, బస్తీలు, కాలనీల్లో మాత్రమే నష్టపరిహారం అందించాలని ఆదేశం ఉందని, దీప్తిశ్రీనగర్ కాలనీ ఆ జాబితాలో లేదని, కనుక ఆ కాలనీ వాసులకు ఎటువంటి పరిహారం అందించడం జరగదని డీసీ ఖరాఖండిగా చెప్పారని తెలిపారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు పలు సూటి ప్రశ్నలు వేశారు. సెల్లార్లలో నివసిస్తున్న వాచ్‌మన్ల కుటుంబాలు బాధితులు కారా ? వారికి నష్టపరిహారం అందించకపోవడం అన్యాయం కాదా ? మీరు కాకుండా అధికార పార్టీ వారు డబ్బులు పంపిణీ చేయాలని ఆదేశాలు ఎవరు జారీ చేశారు ? అధికార పార్టీ చెప్పిన వారికి మాత్రమే పరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఎవరు జారీ చేశారు ? నిజమైన బాధితులకు కాకుండా అపార్ట్‌మెంట్‌ల లో ఉన్నవారికి పరిహారం అందించాలని ఆదేశం ఎవరు జారీ చేశారు ? ప్రతిపక్ష పార్టీలు గుర్తించిన బాధితులకు పరిహారం అందించకూడదని ఆదేశాలు ఎవరు జారీ చేశారు ? ఈ డబ్బు పంపిణీని అధికార పక్షం రాజకీయంగా వాడుకునే వెసులుబాటు కల్పించాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారు ? అని ప్రశ్నలు సంధించారు. వెంటనే బాధితులందరికీ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, దీప్తి శ్రీనగర్ కాలనీ వాసులు సుమారుగా 75 మంది పాల్గొన్నారు.