అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

  • సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
  • జాతి సేవకు పునరింకితం కావాలి
  • అమరవీరులకు ఘనంగా నివాళులు

సైబరాబాద్ ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల సేవలను స్మరిస్తూ సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు మంచి కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. దేశ భద్రత చూసుకునే బాద్యత సైనికులదైతే, దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే బాధ్యత పోలీసులదేనని అన్నారు.

పోలీసు అమ‌ర‌వీరుల స్థూపానికి శాల్యూట్ చేస్తున్న‌ సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్

సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో పోలీసులు విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారన్నారు. అలాగే ఇటీవల కురుస్తున్న వర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌ల్లో వేల ప్రజలకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేప‌ట్టడంలో పోలీసులు ముందున్నారన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని ప్రతి పోలీస్‌ విధుల్లో చేరినప్పుడు ప్రమాణం చేస్తార‌ని, పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తార‌ని, అందుకు తగ్గట్టుగానే విధులు నిర్వర్తించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన వారున్నారన్నారు.

కార్య‌క్రమంలో మాట్లాడుతున్న సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్

ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి అమోఘమని చెప్పారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎండనక, వాననక, రాత్రి, పగలు అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ-పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు.

ర్యాలీ నిర్వ‌హిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది

ప్రజల కోసం పని చేసే పోలీసులకు సహకారం అందించేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. కొత్తగా పోలీసు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 264 పోలీసులు విధి నిర్వహణలో అరులయ్యారని జోహార్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అమరుల మరణం వారి కుటుంబసభ్యులకు తీరని లోటని, చనిపోయిన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. ప్రభుత్వం పోలీసుల అమరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.

సైబరాబాద్ పోలీసులు, సీఆర్పీఎఫ్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ల‌ సహకారంతో విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు చెందిన 14 మందికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇంకా కొన్ని పేర్లు పరిశీలిస్తున్నామని, ఇటీ ఇండస్ట్రీ సహకారంతో వారి అర్హతల మేరకు వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తీవ్రవాద, ఉగ్రవాద పోరులో గాయపడిన పోలీస్ ఆఫీసర్లకు వారికి సీఆర్పీఎఫ్ సహకారంతో రిహాబిలిటేషన్, పునరావాసం కల్పిస్తామన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే డెపార్ట్ మెంట్ పోలీసులు కాబట్టి పోలీసులకు ఎప్పుడూ సహకరించాలన్నారు.
దేశంలోని టెర్రరిజం, ఎక్స్ ట్రీమిజం ను అణచివేసి, శాంతి భద్రతలను కాపాడడం కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగాలను చేశారని గుర్తు చేశారు.

ర్యాలీ నిర్వ‌హిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది

1959 ఇండో-చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ఈ యుద్ధంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారన్నారు. అలాగే 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారని తెలిపారు. అనంతరం పోలీసు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఒక్కొక్కరిగా వచ్చి అందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఈ సంవత్సరం అమరులైన వారి పేర్లను/ రోల్ ఆఫ్ హానర్ ను సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ (సీఎస్‌డ‌బ్ల్యూ) ఏడీసీపీ వెంకట్ రెడ్డి చదివారు.

అనంతరం సైబరాబాబాద్ పోలీస్ సిబ్బంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి సిగ్నల్ వర‌కు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్తవ్య విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు జోహార్, జోహార్, అంతర్జాతీయ, జాతీయ అసాంఘిక శక్తులతో పోరాడి అసువులుబాసిన పోలీసు అమరులు అమర్ ర‌హే అమర్ ర‌హే, ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడంలో మరణించిన పోలీస్ అమరవీరులకు జోహార్, జోహార్ నినాదలతో ర్యాలీ ముందుకు సాగింది.

పోలీసు సిబ్బందిచే గౌర‌వ వంద‌నం స్వీక‌రిస్తున్న సీపీ వీసీ సజ్జనార్

ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శినీ, మాదాపూర్ డీసీపీ వేంకటేశ్వర్లు, వుమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, సైబరాబాద్ క్రైమ్స్ ఏడీసీపీ -I కవిత, సైబరాబాద్ క్రైమ్స్ ఏడీసీపీ-II ఇందిర‌, సైబరాబాద్ క్రైమ్స్ ఏడీసీపీ –III రామచంద్రుడు, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ (సీఎస్‌డ‌బ్ల్యూ) వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్, ఏడీసీపీ (అడ్మిన్) లావణ్య ఎన్ జేపీ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మి నారాయణ, సీసీఆర్‌బీ ఏసీపీ రవిచంద్ర, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్, సీటీసీ ఏసీపీ రమణా రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖ‌ర్, ఇతర ఏసీపీలు, హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది, సీపీ ఆఫీసు సెక్షన్ల సిబ్బంది, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here