నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ ప్రభుత్వ పాఠశాలలో బాలబాలికలకు నల్లగండ్లలోని ఎలైట్ నేత్ర వైద్యశాల సౌజన్యంతో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి పిల్లలలో సోదరభావం, అవగాహన పెంచడానికి సంక్షేమానికి హక్కుల రక్షణకు నవంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. పిల్లలకు సంబంధించిన మానవ హక్కులే పిల్లల హక్కులని అన్నారు. పిల్లల రక్షణ, పెంపకం వారి సాంఘిక హక్కులని అన్నారు. తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు, నిర్భంద విద్య, వైద్యం పౌష్టిక ఆహారం అందించడంతో పాటు బాలికలపై లైంగిక వేధింపులు లేకుండా చూడడం శిశు మరణాలు లేకుండా చూడడం మొదలైనవి బాలల హక్కులన్నారు. ” సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం” అన్నారు. నేత్రాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతామన్నారు. ఇటివల కాలంలో పిల్లలలో కళ్ళు మసక బారుతున్నాయని, దీనికి కారణం జీవన శైలి సరిగ్గా లేకపోవడం, చదివేటప్పుడు సరైన పద్ధతులు పాటించకపోవడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంఛార్జి శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బాలన్న, పాలం శ్రీను, జనార్ధన్ పాల్గొన్నారు.