జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, ఫిర్యాదు
నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ డివిజన్ బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు నరసింహ చారి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వేధింపులకు తాళలేక సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడడంతో తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపించి కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్పొరేటర్ అఘాయిత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది , స్థలం కనిపిస్తే కబ్జా చేయడం, బిల్డింగులు కడుతుంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం, డివిజన్ లో ప్రజలకు రాక్షస పాలన చేస్తున్నాడని మండిపడ్డారు.
సోమవారం రాత్రి జరిగిన సంఘటనకు పోలీసులు ఇంతవరకు ఎఫైఆర్ ఫైల్ చేయకపోవడం సిగ్గుచేటు, వెంటనే పోలీసులు కేసు బుక్ చేసి కార్పొరేటర్ మీద సమగ్ర విచారణ జరిపి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అలాగే కార్పొరేటర్ ను పార్టీ నుండి, పదవి నుండి తొలగించాలన్నారు. అతను ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. మేడ్చల్ అధ్యక్షుడు హరీష్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్ ఆ వ్యక్తిని కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, ఒక ఎమ్మెల్యే అండదండలతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.