శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఆధ్వర్యంలో గురువారం కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలోని అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (UCD), అర్బన్ బయోడైవర్సిటీ (UBD) విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నారాయణ అమిత్తో పాటు రెండు విభాగాల అధికారులు, మహిళా ఉద్యోగులు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పాటలు, ఆటలతో జోనల్ కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు పండుగల ద్వారా ఉద్యోగుల మధ్య ఐక్యత, సాంస్కృతిక అనుబంధం పెంపొందించేలా ఈ వేడుకలు సాగాయి. జోనల్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని నింపాయి.






