శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని శిల్పారామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళా సిబ్బంది బతుకమ్మలను పేర్చి, సాయంత్రం సందర్శకులతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇదే వేదికగా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 14 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఆది బజార్ గిరిజన మేళాను శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ కళాకారులు, గిరిజనులు తమ ఉత్పత్తులను ఈ మేళాలో ప్రదర్శించి, సందర్శకులకు అందుబాటులో ఉంచారు. గిరిజన ఉత్పత్తులు, వారి కళలు, సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేయడమే ఈ మేళా ప్రత్యేకతగా నిలిచింది.

ప్రముఖ నాట్యగురువు ప్రమోద్ రెడ్డి శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 60 మంది కళాకారులు దేవి కీర్తన మాలిక, దేవి వైభవం అంశాలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. చక్కని అభినయం, నృత్య భంగిమలతో అమ్మవారి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. బతుకమ్మ సంబరాలు, గిరిజన మేళా, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో శిల్పారామం సాంస్కృతిక సందడితో కళకళలాడింది.






