శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): పీజేఆర్ స్టేడియంలో వాకర్స్, క్రీడాకారులకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మూగల రఘునందన్ రెడ్డి కోరారు. స్టేడియంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, స్థానిక జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా రఘునందన్ రెడ్డి స్టేడియానికి వచ్చే వాకర్స్, క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పీజేఆర్ స్టేడియం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రఘునందన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. స్టేడియం అభివృద్ధితో పాటు ప్రజలకు, క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వాకర్స్, క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టి, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజన్, టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్, రాష్ట్ర సోషల్ మీడియా సమన్వయకర్త శ్రీహరి, సాయి కిషోర్ ముదిరాజ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి అంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





