ఆర్‌బీఆర్ టవర్స్‌లో బతుకమ్మ సంబరాలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఆర్‌బీఆర్ టవర్స్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. బీఆర్‌ఎస్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. రంగురంగుల పూలతో సృజనాత్మకంగా అలంకరించిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా బతుకమ్మలను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన మహిళలకు మొదటి, రెండో, మూడో బహుమతులను అందజేసి అభినందించారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించి వారి ఉత్సాహాన్ని ప్రోత్సహించారు. మహిళల భాగస్వామ్యం, ఐక్యత, తెలంగాణ సంస్కృతిపై వారికున్న అభిమానం ఈ కార్యక్రమంలో ప్రతిబింబించాయి.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళా శక్తికి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఆర్ టవర్స్ ప్రెసిడెంట్ ఓంప్రకాష్ గౌడ్, ఆర్‌బీఆర్ టవర్స్ అసోసియేషన్ సభ్యులు, కృష్ణ పటేల్, ఏఆర్‌పీ టీమ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ మహిళా శక్తిని గౌరవించిన ఈ బతుకమ్మ సంబరాలు ఆర్‌బీఆర్ టవర్స్‌లో పండుగ వాతావరణాన్ని నింపాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here