నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలాగా మారుతుందని, విద్యాసంస్థలన్నీ సమస్యలకు నిలయంగా మారాయని ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్ డిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున ఆధ్వర్యంలో చేపట్టిన మోటార్ సైకిల్ యాత్రను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య మాటలకే పరిమితమై పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని ఇందుకు ప్రభుత్వ గణాంకాలే నిదర్శనం అన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్ మెంట్స్, స్కాలర్షిప్ లు మాత్రం విడుదల చేయకుండా పెండింగ్ లో ఉంచి మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు విద్యను కాషాయకరణ చేయాలని కేంద్రం చూస్తున్నదని, ఓట్లు సీట్లు ఉప ఎన్నికలపై ఉన్న ప్రత్యేక దృష్టిలో కనీస దృష్టి విద్యార్థులపై లేకపోవడం బాధాకరమని వాపోయారు. బాసర త్రిపుల్ ఐటీ లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా, విద్యార్థులు వారి కనీస వసతుల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న మౌలిక సదుపాయాలు క్షేత్రస్థాయి పరిశీలన జరిపేందుకు ఆరు రోజుల మోటార్ సైకిల్ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులు, విద్యార్థి శ్రేయోభిలాషులు సహకరించాలని కోరారు. మోటార్ సైకిల్ యాత్ర చేపట్టిన ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జునలు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకే యాత్ర చేపట్టినట్లు చెప్పారు. పాలకులు ఇప్పటికైనా పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులోకి విద్యా విధానాన్ని తీసుకురావాలని లేకపోతే జరగబోయే ఉద్యమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డిఎస్ మాజీ నాయకుడు ఇస్లావత్ దశరథ్ నాయక్, శ్రీకాంత్, భాను, ధానయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.