నమస్తే శేరిలింగంపల్లి: రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని ఎంసీపీఐయూ నాయకులు డిమాండ్ చేశారు. ఖరీఫ్ సాగు చేసే రైతులకు పంటరుణాలు, రుణమాఫీ ఇచ్చి బలవంతపు భూసేకరణ ఆపాలని ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు శేరిలింగంపల్లి డిప్యూటీ తహశీల్దార్ మహిపాల్ రెడ్డికి గ్రేటర్ హైదరాబాద్ ఎంసీపీఐయూ నాయకులు వినతి పత్రం అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా పెట్టుబడి సమస్యతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించి లక్ష్యాలు నిర్ధేశించినా ఆచరణలో అమలు కావడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీ దఫదఫాలుగా అమలు చేయడంతో కొత్తగా బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను అశ్రయించి రైతులు అధిక వడ్డీ వలన నష్టపోతున్నారని వాపోయారు. ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీ ఏక మొత్తంగా రైతులకు ఇవ్వాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట వేసిన ప్రతి రైతుకు రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.బలవంతపు భూసేకరణ ఆపాలని, ల్యాండ్ ఫూలింగ్ జీవో 80 రద్దు చేయాలని, ఉచిత ఎరువులు పథకాన్ని అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కౌలు రైతులకు రైతుబంధు, పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి మైదామ్ శెట్టి రమేష్, గ్రేటర్ కమిటీ సభ్యులు పుష్ప, పల్లె మురళి, విమల, పాల్గొన్నారు.