అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ – ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: అన్ని దానాల‌ కంటే రక్తదానం మిన్న అని, రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను‌ కాపాడినట్లు అని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. మంగళవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

రక్తదాతలను సన్మానిస్తున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సిటిజన్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు ఇంచార్జీ డాక్టర్ జి. సంగీతా రెడ్డి పాల్గొని మాట్లాడారు. రక్తదానం పట్ల అవగాహన కల్పించడం, అపోహలు తొలగించడం, రక్త దాతలను అభినందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆస్ట్రియాకు చెందిన ల్యాండ్ స్ట్రీనర్ రక్తంలో గ్రూపులను, పోలియో వైరస్ ను కనుగొన్నారని అన్నారు. వైద్యశాస్త్రంలో ఆయన అందించిన సేవలకు 1930లో నోబెల్ బహుమతి దక్కిందని తెలిపారు. ల్యాండ్ స్ట్రీనర్ జన్మదినోత్సవం జూన్ 14వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ వారు ఆయన గౌరవార్థం 2004 నుండి ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఒక నినాదంతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ప్రపంచ రక్తదానం‌ దినోత్సవంలో మాట్లాడుతున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ సంవత్సరం నినాదం రక్తదానం చేయండి-జీవితాన్ని పంచుకోండి అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ‌అధ్యక్షుడు రామస్వామి యాదవ్ అన్నారు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా రక్తం మాత్రం మానవ శరీరంలోనే నిర్మితమవుతుందని, రక్తం వినియోగం ఎక్కువగా ఉందన్నారు. అవసరానికి తగ్గ ఉత్పత్తి లేక పోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో రక్తదానం పట్ల అవగాహన కల్పించి, రక్తదానం చేసేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి ఒక్కరూ సంవత్సరంలో పురుషులు 3 నుండి నాలుగు సార్లు మహిళలు రెండుసార్లు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నవారు రక్తం ఇవ్వవచ్చని చెప్పారు. 20 నుండి 30 సార్లు రక్తదానం చేసిన 15 మంది రక్త దాతలకు శాలువా జ్ఞాపిక తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, కౌండిన్యశ్రీ నండూరి, వెంకటేశ్వర రాజు, నల్లగొర్ల శ్రీనివాస్ యాదవ్, శివరామకృష్ణ, జీవీ రావు, పాలం శ్రీను, శ్రీచందన, ఉమా చంద్రశేఖర్, ఎస్ ఏ చౌదరి, ఖాదర్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను సన్మానిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here