–హూడా ట్రేడ్ సెంటర్ శ్రీ సీతారామాంజనేయ స్వామిని దర్శించుకున్న మాదవానంద సరస్వతి స్వామి
శేరిలింగంపల్లి( నమస్తే శేరిలింగంపల్లి): తల్లిదండ్రులను పూజించాలని, పెద్దలను గౌరవించాలని, అసహాయంగా ఉన్న వారికి సహాయం చేయాలని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాదవానంద సరస్వతీ స్వామి పిలుపునిచ్చారు. గురువారం హుడా ట్రేడ్ సెంటర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆహ్వానం మేరకు మాదవానంద సరస్వతి విచ్చేశారు. ఆలయంలోని గణపతి, శివలింగం, అభయాంజనేయ స్వామి, సీతారామాంజనేయ స్వామి విగ్రహాలకు మాదవానంద సరస్వతి వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రవచనాలు భోదించారు. శ్రీ రాముడు తల్లిదండ్రులను పూజించడం, పెద్దలకు గౌరవం ఇవ్వడం, నిస్సహాయులకు సహాయం చేయడం వల్లనే తరతరాలుగా భక్తులచే పూజింపబడుతున్నారని అన్నారు. మనిషి ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏది లేదని, ప్రయత్నం లేనిదే ఏదీ రాదని అన్నారు. పరమాత్ముడు ఎక్కడో లేడని ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడని చేసే దానధర్మాలు, పూజలు, సహాయసహకారాలపై ఆధారపడి ఉంటుందన్నారు. దైవ చింతన, గురువు పట్ల అపారమైన నమ్మకం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంతకుముందు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు మాధవానంద సరస్వతి స్వామి వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాగం నాగేందర్ యాదవ్ కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు రామచంద్రమూర్తి, కుకునూరి శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, పవన్, కోటేశ్వర్ రావు, సత్యనారాయణ, బుచ్చిరెడ్డి తో పాటు మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు, వార్డు మెంబర్ కవిత, నాయకులు బద్దం కొండల్ రెడ్డి, బసవయ్య, రవీంద్ర రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.