నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ పరిధిలోని మియాపూర్ ఓంకార్ నగర్ లో త్రాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి.తుకారాం నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎంసీపీఐయు ఆధ్వర్యంలో కాలనీ వాసులు జలమండలి డీజీఎం నాగప్రియకు వినతి పత్రం అందజేశారు. తుకారాం నాయక్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఓంకార్ నగర్ లో మున్సిపల్, జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక బస్తీల్లో ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్న కార్మికులు, వివిధ వృత్తులు చేసుకుంటూ చిన్నపాటి నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని అన్నారు. బస్తీలో ప్రజలకు అవసరమయ్యే కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కనీసం తాగునీటి వసతి,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారిందన్నారు. కనీసం ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి సరఫరా, యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేసేలా చూడాలని డీజీఎం ను కోరారు.వినతిపత్రం ఇచ్చిన వారిలో మురళి, విమల, రంగస్వామి తదితరులు ఉన్నారు.