నమస్తే శేరిలింగంపల్లి: సగరుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కోరారు. సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, సంఘం రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సోమవారం న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో సగరులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో బిసి ‘డి’ లో పరిగణింపబడుతున్న సగర (ఉప్పర) కులాన్ని సంచార జాతిగ గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించేలా ఓబిసి కమిషన్ తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సంఘం రాష్ట్ర కమిటీ బృందం మంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన సగర (ఉప్పర) కులాన్ని ఇతర సమాజంతో సమానత్వంగా జీవించడానికి రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వం సహాయకారిగా చేయూతనందించాల్సిన అవసరం ఉందని సంఘం నాయకులు మంత్రికి విన్నవించారు. పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలోని సగర జాతిని అత్యంత వెనుకబడిన జాతిగ గుర్తించిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు అత్యంత వెనుకబడిన జాతిగా సగర (ఉప్పర) లను పరిగణించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సానుకూలంగా స్పందిస్తూ ప్రధానితో పాటు సంబందిత శాఖ మంత్రులు, అధికారులతో చర్చించి న్యాయం జరిగేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర తో పాటు జాతీయ లవన్కార్ సమాజ్ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి చాతిరి వెంకట్రావ్ సగర, లవన్కార్ సమాజ్ ఫెడరేషన్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ భారతి, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర కోశాధికారి నలుబాల బిక్షపతి సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సగర, ప్రధాన కార్యదర్శి మర్క సురేష్ సగర తదితరులు ఉన్నారు.