నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ జీహెచ్ఎంసీ అధికారులకు, వర్షాకాలం అత్యవసర సిబ్బందికి సూచించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు అప్రమత్రంగా ఉంటూ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వరద ముంపునకు గురికాకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, రోడ్ల పై మ్యాన్ హోల్ , నీటి గుంతలు వంటి సమస్యలు ఉంటే మా దృష్టికి గాని , సంబంధిత అధికారుల దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిషరిస్తామన్నారు. ప్రజల రక్షణే ప్రభుత్వ ద్యేయమని అన్నారు. వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. సంపులలో క్లోరిన్, బ్లీచింగ్ పౌడర్ ను చల్లించాలని, దీని ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. నాలా పూడిక తీత పనులు వేగవంతం చేసి, నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో, కాలనీలలో అన్ని శుభ్రం చేయాలనీ, చెత్తా చెదారం తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియచేసారు.