నమస్తే శేరిలింగంపల్లి: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చందానగర్ పాపిరెడ్డినగర్ కాలనీకి చెందిన మొగుడప్ప చెత్త సేకరించే వాహనం నడుపుతుంటాడు. ప్రతీరోజూ ఇతనికి పనిలో సోదరుడు, తండ్రి, తండ్రి సోదరుడు సహాయం చేస్తుంటారు. కాగా ప్రతీ రోజూ మాదిరిగానే బుధవారం చెత్త సేకరించేందుకు కలిసి వెళ్లిన వారు డోయన్స్ కాలనీ వద్ద టీ తాగేందుకు వెళ్లారు. అదే సమయంలో మొగుడప్ప తండ్రి సోదరుడు యస్.రాంచందర్(53) మూత్ర విసర్జన చేసేందుకు రోడ్డు దాటబోయాడు. ఇదే క్రమంలో వేగంగా వచ్చిన ఆల్టో కారు కెఎ04ఎంఎల్8780 రాంచందర్ ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






