శేరిలింగంపల్లి, జూలై 12 (నమస్తే శేరిలింగంపల్లి): కార్యకర్తలను కాపాడుకునే వారే నిజమైన నాయకులుగా ఎదుగుతారని, నాయకత్వానికి కులం, మతంతో సంబంధం లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి మియాపూర్ డివిజన్ న్యూ కాలనీలో బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ లెవల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మియాపూర్ డివిజన్లో 57 బూత్‌లు ఉన్నాయని, పార్టీ ఆశావహులకు ఇది మంచి అవకాశమని అన్నారు. బస్తీలు, అపార్ట్మెంట్లకు వెళ్లి ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలే ప్రజల్లో తిరుగుతున్నారని, ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

నాయకులు తమ కార్యకర్తలను అండగా నిలబెట్టినప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. తాజా సర్వేల్లో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందని ఆయన తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కోర్టు వివాదంలో ఉన్న భూమిలో సీఎంసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది ప్రభుత్వ అవగాహన లోపమా లేక ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, మహిళలకు చీరలు పంపిణీ, కంటి పరీక్షల పేరుతో ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి సంక్షేమ పథకాల నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడు సీట్లు కూడా రావని, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అన్నారు. ప్రజల పక్షాన నిలబడే వారే నాయకులవుతారని మరోసారి స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లిలో ఎక్కువ డివిజన్లు గెలిస్తే మేయర్ పదవి దక్కే అవకాశం ఉంటుందని పేర్కొంటూ, అన్ని డివిజన్లలో పార్టీని గెలిపించేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. త్వరలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తానని, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని, తాను ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే వారిపై తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించిన ఆయన, అధికారులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం యాదవ్, రంగారావు, రోజా కలిదిండి, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, గోపరాజు శ్రీనివాస్ రావు, కొంచె శివరాజ్ ముదిరాజ్, గంగారం నర్సింగ్ రావు, సరూపా, జంగీర్, అనీఫ్, శ్రీశైలం, చిన్న వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





