నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరంలో కోవిడ్ కారణంగా నిలిపివేసిన ఎంఎంటియస్ సేవలను వెంటనే పునరుద్ధరించడంతో పాటు ఎంఎంటియస్ ఫేజ్-2 సేవలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, ఎస్‌యుసిఐ, ఎంసిపిఐయు పార్టీలకు చెందిన నాయకులు సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైల్వే జనరల్ మేనేజర్ కు వినతిపత్రం సమర్పించారు. నగరంలో విమాన, బస్సు, మెట్రో సేవలు పున: ప్రారంభమై ఆర్థిక కలాపాలు జరుతున్నప్పటికీ లోకల్ రైళ్ల సేవలు ప్రారంభించని కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నెల రోజుల క్రితం సేవలు తిరిగి ప్రారంభిస్తామని రైల్వే అధికారులు ప్రకటించినప్పటికీ నేటికీ సేవలు ప్రారంభించలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం కారణంగా ఎంఎంటియస్ ఫేజ్-2 పనులు ప్రారంభం కాలేదని, పనులు పూర్తయితే దాదాపు లక్షన్నర మంది ప్రయాణీకులకు రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయిని తెలిపారు. నిధుల్లో ప్రాధాన్యత ట్రాక్ ల నిర్మాణానికి కాకుండా స్టేషన్, భవనాల నిర్మాణానికి వెచ్చించారని, రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్‌లో ఎంఎంటియస్ కు నిధులు కేటాయించకపోవడం నగర ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. ప్రభుత్వాలు ఫేజ్-2 పనులను వెంటనే ప్రారంభించాని, ఎంఎంటియస్ సేవలను వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎం.నర్సింహ, సిపిఎం నాయకులు శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఝాన్సి, అనురాధ, ఎంసిపిఐయు నాయకులు తుకారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.