మసీదుబండ వరద ముంపుకు చెక్.. రూ.4 కోట్లతో డ్రెయినేజ్ కాలువ‌ పనుల‌ను పరిశీలించిన ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండ కుడికుంట చెరువు అలుగు నుంచి ప్రభుపాద లేఔట్ కాలనీ వరకు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాలువ‌ నిర్మాణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రభుపాద లేఔట్ కాలనీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వరద నీటి ఔట్‌లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రూ.4 కోట్లతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ‌ పనులను వేగవంతంగా పూర్తి చేసి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

కాలనీలో సరైన ఔట్‌లెట్ లేక ప్రతి వర్షాకాలంలో వరద నీరు నిలిచి ముంపు సమస్య తలెత్తుతోందని, ఇకపై అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కుడికుంట చెరువు ఔట్‌లెట్ నుంచి అధిక నీటి ప్రవాహం వస్తున్నందున దానిని దృష్టిలో ఉంచుకుని కాలువ‌ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. పనులు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా, సురక్షితమైన జీవన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని ఆరెకపూడి గాంధీ పునరుద్ఘాటించారు. ఈ పరిశీలనలో CMC ఇంజనీరింగ్ విభాగం డీఈ ఆనంద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here