శేరిలింగంపల్లి, జూలై 12 (నమస్తే శేరిలింగంపల్లి): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ మియాపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో SIR కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. స్థానిక నాయకులు, నివాసితులతో కలిసి మక్తా డివిజన్‌లోని ప్రజా షెల్టర్స్, బీకే ఎంక్లేవ్‌తోపాటు ఇతర నివాస ప్రాంతాలను సందర్శించిన ఆయన, ఓటరు నమోదు ప్రక్రియ పురోగతిని పరిశీలించి ప్రజలకు అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటరు నమోదు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉందో లేదో నిర్ధారించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా భాగస్వామి కావాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్యూమరేషన్ ఫామ్‌ను ఆన్‌లైన్‌లో కూడా సులభంగా సమర్పించవచ్చని వివరించిన యలమంచి ఉదయ్ కిరణ్, ఫామ్‌ను ఎలా పూరించాలో దశలవారీగా ప్రజలకు స్వయంగా అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకునేలా మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రావిపాటి వెంకటేశ్వర్లు, రెడ్డమ్మ, గోపాలకృష్ణ, శ్రీనివాస్, ధనుంజయ, ఎంసీ రెడ్డి, రామకృష్ణ, శ్రీను, నవీన్, వంశీ, ప్రవీణ్, రామ్, శశితోపాటు పలువురు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.





