బీసీలకు బహుజన రాజ్యాధికారం అవసరం: బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూలై 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్రంలో కులాల జనాభా దామాషా ప్రకారం ప్రతి వర్గానికి రావాల్సిన వాటా అందాలంటే బహుజన రాజ్యాధికారమే మార్గమని బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలోని బీసీ భవన్‌లో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు బీసీ కుల సంఘాల తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాలను కలుపుకుంటూ ఐక్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కొన్ని కులాలు ఇప్పటికీ గుర్తింపు, జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అలాంటి వర్గాలకు న్యాయం జరిగేలా అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీల ఐక్యత, హక్కుల సాధన కోసం బేరి రామచందర్ యాదవ్ చేపడుతున్న ఉద్యమానికి తమ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో బీసీలకు దామాషా పద్ధతిలో వాటాలు కల్పించాలనే డిమాండ్‌కు అన్ని బీసీ సంఘాలు ఏకమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్, యాదవ్, పద్మశాలి, గౌడ, మున్నూరు కాపు తదితర కుల సంఘాల నాయకులతో చర్చలు కొనసాగుతున్నాయని బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. అన్ని కుల సంఘాల మద్దతుతో బహుజన రాజ్యాధికార సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ సాగర సంఘం సలహాదారు జి. వెంకటేష్ సాగర్, ఎస్సీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దండు లక్ష్మయ్య, సాయన్న ముదిరాజ్, హరికృష్ణ చారి, కుమార్ యాదవ్, సాయి కురుమ, రాజు గౌడ్, పద్మశాలి అశోక్, కిరణ్ ముదిరాజ్, రజక సంఘం మల్లేష్‌తోపాటు వివిధ బీసీ కుల సంఘాల నాయకులు, యువత పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here