శేరిలింగంపల్లి, జూలై 12 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి బాగ్ అమీర్లోని రామకృష్ణ హైస్కూల్‌కు చెందిన 1997 పదో తరగతి తెలుగు, ఇంగ్లీష్ మీడియం పూర్వ విద్యార్థులు 29 ఏళ్ల తర్వాత ఆదివారం ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. చాలా కాలం తర్వాత కలుసుకున్న సహ విద్యార్థులు ముందుగా తమ పాఠశాలను సందర్శించి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కూకట్‌పల్లిలోని ఏటీసీ బ్యాంక్వెట్ హాల్లో నిర్వహించిన సమావేశాన్ని పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ నర్సా రెడ్డి, జాన్సన్ బాబు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, అరుణ, నిర్మల, రాజేశ్వరి, శుక్లాదత్త తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాల రోజులలో జరిగిన మధుర సంఘటనలను గుర్తుచేసుకుంటూ విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు అందించారు. జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ తమ ఆశీర్వాదాలను అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి దశలోని అనుభవాలతోపాటు ప్రస్తుతం వివిధ రంగాల్లో సాగుతున్న తమ ప్రయాణాన్ని ఒకరితో ఒకరు పంచుకుని ఆప్యాయంగా గడిపారు. భవిష్యత్తులో సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతోపాటు, తమ బ్యాచ్‌లోని ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.






